ఒక్కోసారి మనలో కొందరికి అనిపిస్తుంటుంది… ‘ఏమిటీ జీవితం, ఎందుకిలా బతుకుతున్నా’నిని.’ సుఖసంపదలలో తులతూగే వాళ్లకు ఇలా అనిపించకపోవచ్చునేమో కానీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇలా అనిపిస్తుంటుంది. అయితే జీవితం జీవించడానికే అన్నది సత్యం. జీవితంలో అన్ని మన చేతిలో ఉండకపోవచ్చు. దానిని మనం విధికి వదిలేయాల్సిందే. కానీ మనం ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఎవరైనా సరే జీవిత పరమార్థం తెలుసుకుంటే వారి నిర్ణయాలు, ప్రవర్తన, లక్ష్యాలు, జీవితం పయనించే దిశ, మతం, ఇహపరలోకాల సార్థకతకు సంబంధించిన విషయాల్లో మెరుగైన మార్గాన్నే అనుసరించగలరు.

జీవిత లక్ష్యం ఏమిటి? మనందరినీ దేవుడు ఎందుకు సృషించాడు? ఎందుకంటే ఆరాధించడానికి, విధేయత చూపడానికి, మన సృష్టికర్త ఒక్కడినే సేవించడానికి. మన జీవితాన్ని దేవుడు చూపిన మార్గంలో గడపడమే మన జీవిత పరమార్థం. దేవుని ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ, దేవుని ప్రసన్నత పొందడానికి ప్రయత్నిస్తూ పరలోక సాఫల్యం పొందడమే జీవిత లక్ష్యం. దేవుడు మనందరినీ సృష్టించాడు కాబట్టి మన తల్లిదండ్రుల వలే విధేయతను కోరే హక్కు ఆయనకూ ఉంది. భూమి, ఆకాశం, ఎత్తైన పర్వతాలు, నీరు, సముద్రాలు, అందమైన ప్రకృతి, ఫలపుష్పాలు ఇత్యాదులన్నీ అల్లాహ్ మనకోసమే సృష్టించాడు. ఈ విశ్వవ్యవస్థ యావత్తు దేవుని విధేయతకు కట్టుబడి పనిచేస్తుంది. సృష్టిలో ప్రతి వస్తువుతో ఏదో ఒక ప్రయోజనం ఉంది. మనిషిని కూడా దేవుడు మట్టి నుండి సృష్టించాడు. అంతేకాక అతడిని పరీక్షించేందుకు భూమిపైకి పంపాడు. మనిషికి దేవుడు తెలివి, చైతన్యం, స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ విశ్వం ఒకరోజు అంతమై అందరూ సమీకరించబడతారని ఖుర్‌ఆన్‌ తెలిపింది. ఆ రోజును ప్రళయ దినం అంటారు. ఎవరైతే అల్లాహ్ ను, ఆయన దూతలను, ప్రళయ దినాన్ని నమ్ముతూ మంచి పనులు చేస్తారో వారంతా స్వర్గంలోకి ప్రవేశిస్తారని కూడా ఖుర్‌ఆన్‌ సెలవిచ్చింది.

జీవితం చాలా పవిత్రమైనది. అది అల్లాహ్ ప్రసాదించిన వరం. సృష్టిలో మనకు కనిపించే మూగ జీవులు, పశుపక్షాదులు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, జిన్నుల కంటే కూడా ఉన్నతంగా అల్లాహ్ మనకు ఈ మానవ జన్మను ప్రసాదించాడు. మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని తిరిగి తీసుకునే శక్తి కూడా అల్లాహ్ కే ఉంది. ఎవరు ప్రాణాలు తీసుకుంటారో వారు పాపం చేసినవారవుతారు. ఇస్లాం మతంలో ఆత్మహత్య అన్నది మహా పాతకం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకోవాలే తప్ప ఆత్మహ్యతకు పాల్పడకూడదు. ఎలాంటి పరిస్థితులలోనైనా జీవించాలి. మనకు పూర్వం మహానుభావులు, ప్రవక్తలు ఎలా జీవించాలన్నది ఆదర్శంగా చూపారు. అల్లాహ్ అగ్ని నుండి జిన్నులను, మట్టి ద్వారా మనిషిని సృష్టించాడు. మనిషి కేవలం సంపదను, పేరుప్రఖ్యాతులను పొందడానికే ఉనికిలోకి తేబడలేదు. కేవలం విందు వినోదాల్లో తేలియాడేందుకు జీవితం ప్రసాదించబడలేదు.

ఇస్లాం మతం మరణానంతరం పరలోక జీవితం ఉందని బోధిస్తోంది. ఎవరు ఎప్పుడు చనిపోవాలన్నది అల్లాహ్ నే నిర్ణయిస్తాడు. మనిషి చనిపోయాక మూడు ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. 1. ఎవరు నీ దేవుడు, 2. ఏది నీ ధర్మం (దీన్), 3.నీ ప్రవక్త ఎవరు? అనేవి. ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితాన్ని అల్లాహ్ మెప్పు పొందడానికి వెచ్చిస్తారో వారు మరణానంతరం పరలోక జీవితంలో శాశ్వత సుఖాలు అనుభవిస్తారు. స్వర్గసీమకు వారసులవుతారు అని శుభవార్త అందిస్తోంది ఖుర్‌ఆన్‌. ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితాన్ని మనోవాంఛలకు బానిసై ఇష్టారాజ్యంగా గడుపుతారో అలాంటి వారు శాశ్వతమైన నరకాగ్నికి ఆహుతి అవ్వాల్సి ఉంటుందని ఖుర్‌ఆన్‌ హెచ్చరించింది. మనిషి సన్మార్గంలో తన జీవితం గడపాల్సి ఉంటుంది. మంచి మార్గంలో నడిచి స్వర్గాన్ని సాధించడమో, లేదా చెడు మార్గంలో నడిచి నరకానికి పోవడమో నిర్ణయించుకునే స్వేచ్ఛను మనిషికి దేవుడు ఇచ్చాడు.

ప్రతి మనిషి ఎలా జీవించాలన్నది ఇస్లాం చక్కగా బోధించింది. పవిత్రంగా జీవించాలని నొక్కి చెప్పింది. వడ్డీ మహా పాపం అంది. ఇతరుల సంపద అమానత్‌ అన్నది. చిన్నారుల, బలహీనుల, మహిళల హక్కులు, ఆస్తిపాస్తులు అన్యాయంగా లాక్కోకూడదంది.

ఇస్లాం మతం జీవితం విషయంలో ఇచ్చిన తొలి ఆదేశం…‘చదువు’ అనే. అందుకనే అందరూ చదవాలి. నేర్చుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న విషయాలను అన్వేషించి సత్యాన్ని తెలుసుకోవాలి. జీవితంలో అజ్ఞాన తిమిరాన్ని అధిగమించాలి. శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందాలి.

ఇస్లాం మతం అందరినీ నీతిగా బతకమంటుంది. ఇస్లాం ధర్మం నిషేధించిన వాటిని హరామ్‌ అంటాము. ముస్లింలు హరామ్‌ పనులు చేయకుండా, హలాల్‌(అనుమతించిన) పనులు చేయాల్సి ఉంటుంది. సక్రమమైన జీవితం, సన్మార్గ జీవితం గడపాలనుకునే వారికి చెడు వ్యసనాలు ఉండకూడదు. వ్యసనాలు మొదట ప్రలోభానికి గురిచేసి చివరికి పతనానికి కారణమవుతుంటాయి. అలాగే మనిషికి చెడుగుణాలు కూడా ఉండకూడదు. అంటే మదం(గర్వం), అత్యాశ, కామం, ఈర్ష్య, తిండిపోతుతనం, క్రోధం, బద్ధకం వంటివి ఉండకూడదు.

ఇస్లాం ధర్మం అందరూ అర్థవంతమైన జీవితాన్ని అన్వేషించేలా చేస్తుంది. పురుషులకు, మహిళలకు సమాన హక్కులు కల్పించిన నిష్పాక్షిక మతం ఇస్లాం. దైవభీతితో అందరినీ సన్మార్గంలో బతికేలా చేస్తుంది.

చివరగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. దైవాదేశానుసారం సన్మార్గంలో జీవించి, తీర్పు దినాన దేవుడికి జవాబు చెప్పుకునేలా బతకాలి. అందరూ సుఖసంతోషాలతో, సమానత్వంతో, న్యాయబద్ధంగా, హక్కులతో, చీకూచింతాలేకుండా జీవించేందుకు, అందరి సంక్షేమాన్ని చూసేది ఇస్లాం ధర్మం మాత్రమే. అందరికీ జీవిత పరమార్థాన్ని తెలిపేది, ఎంతో చిన్నదైన జీవితంలో ఎలా జీవించాలో నేర్పించే అసలైన మతం ఇస్లాం. ఆధునిక కాల పరిస్థితులు మారినా, జీవన స్థితిగతులు మారినా అందరికీ మంచి జీవన మార్గాన్ని చూపేది ఇస్లాం ధర్మమేనని చెప్పక తప్పదు.

అశోక్‌,
హైదరాబాద్‌,
91 94901 72381

Disclaimer: The views expressed in this blog post are those of the authors and do not necessarily reflect the views of Jamaat-e-Islami Hind Telangana