ప్రపంచంలో సుమారు ఎనిమిది బిలియన్ల జనాభా ఉన్నారు. వారంతా ఒకేరూపురేఖలు కలిగి ఉంటారు. పోలికల్లో మాత్రమే తేడా. శరీర నిర్మాణం, అవయవాల పనితీరు ఒకేలా ఉంటాయి. జనుల శరీర నిర్మాణ తీరు ఒకేలా ఉండటాన్ని బట్టి చూస్తే అందరినీ సృష్టించిన వాడు ఒక్కడే అయి ఉంటాడన్నది ఎవ్వరైనా ఇట్టే చెప్పగలరు. మరి మనల్ని పుట్టించిన ఆ పరమ ప్రభువు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఇంత అద్భుత శరీరాన్నిచ్చి లోకానికి లక్ష్య రహితంగా పంపిచాడా దేవుడు? ప్రపంచంలో రోజూ ఎంతోమంది పుడుతున్నారు. మరెంతో మంది పుట్టి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తరువాత ఏమవుతున్నారు? జనన మరణాలు అసలు ఎందుకు? అనే ప్రశ్నలు మీరెప్పుడైనా వేసుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టడం మానవమాతృలకు సాధ్యం కాదు. దైవ గ్రంథాల ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే మనిషిని పుట్టించిన దేవుడు మనిషి జీవించడానికి ఒక నియమావళిని రూపొందించాడు. ఆ నియమావళి ఖుర్ఆన్ రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉంది. మనమెలా బ్రతకాలి? మన జన్మ లక్ష్యమేమిటి? మరణం తరువాత మరో జీవితం ఉందా? అనే విషయాలను ఖుర్ఆన్ ద్వారా తెలుసుకోవడం ద్వారా ఈ ప్రాపంచిక జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా బ్రతికేయవచ్చు. మరణించిన తరువాత ముక్తి మోక్షాలు లభిస్తాయి. మానవ పుట్టుక గురించి, అతని లక్ష్యం గురించి, మరణానంతర జీవితం గురించి ఖుర్ఆన్ హేతుబద్దంగా చర్చించింది.

మనిషి జీవిత లక్ష్యం ఏమిటి?

‘మేము మానవులను, జిన్నులను మా ఆరాధన కోసమే సృష్టించాము’ (దివ్యఖుర్ఆన్)

ఆరాధన అంటే కేవలం దైవనామస్మరణ చేయడమే కాదు. మనోకాంక్షలను అదుపుచేసుకోవాలి. జీవితంలోని ప్రతీ అడుగులో దైవమార్గదర్శకత్వంలో జీవించాలి.

జీవితం పరీక్ష

మనిషి పుట్టుక కేవలం ఒక పరీక్ష మాత్రమే. కొన్ని రోజుల ఈ జీవితంలో ఎవరు దైవదాస్యం చేస్తూ, మంచి మార్గంలో జీవిస్తారో చేడటానికే. ప్రాపంచిక తళుకుబెళుకులకు మోసపోకుండా, దైవాభీష్టం గడపాలి’ అంటుంది ఖుర్ఆన్.

పరలోక భావన

పుట్టిన ప్రతీ ప్రాణీ గిట్టక మానదు. దేవుడిని నమ్మేవారైనా, నమ్మని వారైనా మరణాన్ని నమ్మాల్సిందే. మరణం తిరుగులేని వాస్తవం. అది ఏక్షణంలోనైనా వచ్చి తీరుతుంది. ఈ సృష్టి ఉనికిలోకి వచ్చినప్పటి నుండి ప్రళయం వరకూ ఎంతమందైతే పుట్టి గిట్టారో వారందరినీ ఒకరోజు సమావేశ పరిచే రోజు వస్తుందన్నది ఖుర్ఆన్ హెచ్చరిక. దీన్నే ఖుర్ఆన్ గ్రంథం ‘ఖియామత్’ ‘ప్రళయంగా’ గా అభివర్ణించింది. ఆ రోజున మనిషి తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. జీవితాన్ని ఎలా గడిపాడు? యవ్వనాన్ని ఎలా గడిపాడు? డబ్బు ఎలా సంపాదించాడు? ఎలా ఖర్చు పెట్టాడు? అనే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో విఫలమైనవారికి నిత్యయాతన ఉంటుంది. నరకానికి తీసుకెళతారు. ఎవరైతే జీవిత ఘడియలను దైవాభీష్టానికి అనుగుణంగా నడుచుకున్న వారు స్వర్గానికి అర్హులవుతారని ఖుర్ఆన్ శుభవార్త అందిస్తుంది. ఈ జీవిత రహస్యాన్ని తెలుసుకుంటే ప్రపంచంలో ఎలాంటి దు:ఖాలు వేధించవు. శాశ్వతమైన పరలోక రాజ్యంలో స్వర్గానికి వారసులు కావచ్చు.

ముహమ్మద్ ముజాహిద్
9640622076

Disclaimer: The views expressed in this blog post are those of the authors and do not necessarily reflect the views of Jamaat-e-Islami Hind Telangana